రద్దయిన టీఎస్ పీఎస్సీ పరీక్షలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

ktr press meet over TSPSC paper leakage
  • నాలుగు పరీక్షలకు తిరిగి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడి
  • ఈ పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందిస్తామన్న కేటీఆర్
  • రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లు  24 గంటలు తెరిచి ఉంచుతామని ప్రకటన 
  • నిరుద్యోగులకు ఉచిత భోజనం అందిస్తామని వెల్లడి 
టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నలుగురు మంత్రులు, ప్రభుత్వ సీఎస్ తో కలిసి సమీక్ష నిర్వహించినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లీకేజీకి పాల్పడిన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వెనక ఎవ్వరు ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఇద్దరి వెనుక ఎవరు ఉన్నా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిట్ ప్రాధమిక దర్యాప్తు మేరకు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అన్నారు. వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని, హ్యాకింగ్ జరగలేదని స్పష్టం చేశారు. 

కానీ, కొంతమంది విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి వలలో పడవద్దని యువతకు కేటీఆర్ సూచించారు. ఈ కేసులో అరెస్టయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అన్నారు. లీకేజీ వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నది తేల్చాలని డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

గ్రూప్1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో పెడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి 24 గంటలు నడిచేలా చేస్తామన్నారు. స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
Go Back to Shorts
KTR
tspsc
pressmeet

More Telugu News