ఆసక్తిని రేపుతున్న 'హను మాన్' టీజర్!

21-11-2022 Mon 13:58
  • తేజ సజ్జ హీరోగా రూపొందిన 'హను మాన్'
  • సూపర్ హీరో కాన్సెప్టుతో నిర్మితమైన సినిమా 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్
Hanu Man Movie Teaser Released
తేజ సజ్జ హీరోగా గతంలో 'జాంబీ రెడ్డి' సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, అతనితోనే 'హను మాన్'; అనే మరో సినిమాను రూపొందించాడు. సూపర్ హీరో కాన్సెప్టుతో తయారైన సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా అమృత అయ్యర్ అలరించనుండగా, కీలకమైన పాత్రలు వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా అద్భుతమైన విజువల్స్ తో రానుందనే విషయం టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. కొండలు .. లోయలు .. జలపాతాలు .. సముద్రగర్భం .. ఇలా ప్రకృతిని కూడా భాగం చేస్తూ ఈ సినిమాను రూపొందించారనే విషయం స్పష్టమవుతోంది. హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న హనుమంతుడు .. ఇతర ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. 

ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.  తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గౌరహరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.