వృద్ధాప్యంలో ఏ రోగాలొస్తాయో ఈ ఒక్క హార్మోన్ ను చూసి చెప్పేయవచ్చు..!
- వ్యాధుల గురించి ముందే చెప్పే ఐఎన్ఎస్ఎల్ 3
- యుక్త వయసులో ఇది తక్కువగా ఉంటే.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యల ముప్పు
- తాజా పరిశోధనలో కనుగొన్న శాస్త్రవేత్తలు
వయసు పెరిగిన తర్వాత వచ్చే వ్యాధులకు సంబంధించి దీన్ని ముఖ్యమైన బయోమార్కర్ గా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమయ్యాయి. పురుషుడి వృషణాల్లోని కణాలు టెస్టో స్టెరాన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయని తెలుసు. ఈ కణాలే ఐఎన్ఎస్ఎల్ 3ని కూడా ఉత్పత్తి చేస్తాయి.
టెస్టో స్టెరాన్ జీవితాంతం ఒకే స్థాయిలో ఉండదు. హెచ్చు తగ్గులకు లోనవుతుంటుంది. కానీ, ఐఎన్ఎస్ఎల్ 3 అలా కాదు. జీవితాంతం ఒకే స్థాయిలో ఉంటూ, జీవిత చరమాంకంలో స్వల్పంగా తగ్గుతుంది. వయసు ఆధారిత వ్యాధులు వచ్చే విషయాన్ని చెప్పే ముఖ్య సూచిక ఇదేనని తాజా అధ్యయనం తెలుసుకుంది. రక్తంలో ఐఎన్ఎస్ఎల్ 3 స్థాయికి, ఎముకల బలహీనత, లైంగిక సామర్థ్యం, మధుమేహం, గుండె జబ్బులకు మధ్య సంబందం ఉందని వీరు తెలిపారు.
యుక్తవయసులో ఐఎన్ఎస్ఎల్ 3 అధికంగా ఉన్న వారికి వృద్ధాప్యంలోనూ అది అధిక పరిమాణంలోనే ఉంటుందని, యుక్త వయసులో తక్కువ ఉన్న వారికి చివరి జీవితంలో తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇలా ఐఎన్ఎస్ఎల్ 3 తక్కువగా ఉండే వారికి వృద్ధాప్యంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్నారు.