Facebook: ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం!

Facebook Parent Meta Is Preparing to Notify Employees of Large Scale Layoffs
  • ట్విట్టర్‌ బాటలో పయనిస్తున్న ఫేస్‌బుక్
  • పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటేసేందుకు రంగం సిద్ధం
  • 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి
  • బుధవారం ప్రకటన వచ్చే అవకాశం
ఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది. కరోనా తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ ఉద్యోగాల కోతలు పెరుగుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

వేలాదిమంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైందని, బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబరు చివరి నాటికి 87 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్టు మెటా పేర్కొంది. కాగా, ఈ వారంలో అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ‘మెటా’ ఇప్పటికే ఉద్యోగులకు సూచించినట్టు సమాచారం. 

ఫేస్‌బుక్ 18 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయిలో ఉద్యోగుల కోత ఉండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులను సగానికి సగం తగ్గిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే పలు విభాగాల హెడ్‌లపై వేటు వేయగా, పలువురు ఉద్యోగులను కూడా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫేస్‌బుక్ నడుస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఉద్యోగుల తొలగింపు వార్తలపై స్పందించేందుకు ఫేస్‌బుక్ ప్రతినిధి నిరాకరించారు.

More Telugu News

Facebook
Meta
Layoffs
Twitter