ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీం సంచలన నిర్ణయం.. రూ.వంద కోట్ల తో మళ్లీ ​వీఎఫ్ఎక్స్ పనులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీం సంచలన నిర్ణయం.. రూ.వంద కోట్ల తో మళ్లీ ​వీఎఫ్ఎక్స్ పనులు!

Adipurush team re work on vfx and cg with rs 100 cr
  • గత నెలలో విడుదలైన టీజర్ పై తీవ్ర విమర్శలు
  • గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని ప్రేక్షకుల అసంతృప్తి
  • భారీ ఖర్చుతో సాంకేతిక తప్పిదాలను సరిచేసే పనిలో చిత్ర బృందం
  • సంక్రాంతికి బదులు వేసవిలో విడుదల కానున్న ప్రభాస్ కొత్త చిత్రం
బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్లుగా మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ నిరాశ పరిచాయి. దాంతో, తన తదుపరి చిత్రం ఆదిపురుష్ పై అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత నెలలో ఈ చిత్రం టీజర్ విడుదలైంది. కానీ, దానిపై విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లుక్ బాగాలేదని, టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయానని అంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను సంతృప్తి పరిచేందుకు చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

వీఎఫ్ ఎక్స్, సీజీ వర్క్స్ లో తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఏకంగా రూ. వంద కోట్ల ఖర్చుతో వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరి చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్స్, టీజర్ లో విడుదల తేదీని వెల్లడించింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ తప్పులు సరి చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి బదులు వేసవిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిత్రం విడుదల వాయిదా పడుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Prabhas
aadipurush
100cr
vfx
work

More Telugu News