సీబీఐ చేతికి నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు?

ap high court reserves the final judgement in theft at nellore district court
ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేకెత్తించిన నెల్లూరు జిల్లా డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐ చేతికి చేరేలా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఇస్తే త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రైన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తగిన ఉత్తర్యులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అనంత‌రం ఈ కేసులో విచార‌ణ ముగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కోర్టు తుది తీర్పును రిజ‌ర్వ్ చేసింది.

కొంత‌కాలం క్రితం నెల్లూరులోని జిల్లా కోర్టులోకి చొర‌బ‌డ్డ గుర్తు తెలియ‌ని దుండ‌గులు... కోర్టులోని ప‌లు కీల‌క పత్రాల‌ను అప‌హ‌రించారు. ఈ ప‌త్రాల‌తో పారిపోతున్న వారు కోర్టు ఆవ‌ర‌ణ‌లో ప‌లు ప‌త్రాల‌ను ప‌డేశారు. ఇలా ప‌డిపోయిన ప‌త్రాల్లో ఏపీ కేబినెట్‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై న‌మోదైన ఓ కేసు వివ‌రాలు కూడా క‌నిపించాయి. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మంత్రిపై గ‌తంలో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమిరెడ్డి ప‌లు ప‌త్రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు. అదే స‌మ‌యంలో పోలీసులు కూడా ప‌లు కీల‌క ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు. 

చోరీలో ఈ కేసుకు సంబంధించిన కీల‌క ప‌త్రాలు మాయ‌మ‌య్యాయి. త‌న‌పై న‌మోదైన కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే కాకాణి ఈ చోరీ చేయించార‌ని సోమిరెడ్డితో పాటు టీడీపీ నేత‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కోర్టులోకి చొర‌బ‌డ్డ దొంగ‌లు ఇత‌ర‌త్రా ప‌త్రాల‌ను వ‌దిలేసి కాకాణి కేసుకు సంబంధించిన ప‌త్రాల‌ను మాత్రమే ఎందుకు తీసుకెళ్లార‌ని కూడా టీడీపీ నేత‌లు లాజిక్ తీశారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను కాకాణి కొట్టిపారేశారు. టీడీపీ, వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెరదీసిన ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు అప్ప‌గించే దిశ‌గా ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
YSRCP
TDP
AP High Court
Kakani Govardhan Reddy
Nellore District
Somireddy Chandra Mohan Reddy
CBI

More Telugu News