Kishan Reddy: ప్రగతి భవన్ లోకి మంత్రులకు ప్రవేశం లేదు.. ఎంఐఎం అధినేత మాత్రం నేరుగా వెళతారు: కిషన్ రెడ్డి

Kishan Reddy slams TRS govt
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, నగరంలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పరస్పర విమర్శల దాడి తీవ్రతరం చేశాయి. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అధికారులు బీజేపీ ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారని, టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. 

ప్రగతి భవన్ లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశం లేదని, కానీ ఎంఐఎం అధినేత నేరుగా ప్రగతి భవన్ లోకి వెళ్లి సీఎంను కలుస్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నెలలో 20 రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లలో ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని ఆరోపించారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో ఉన్నది తండ్రీకొడుకుల నిరంకుశ సర్కారు అని వ్యాఖ్యానించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల పేరిట ఇంటింటికీ రూ.10 వేలు పంచారని, ఎన్నికలు పూర్తయ్యాక వరద బాధితులకు సాయం ఆపేశారని మండిపడ్డారు. వాస్తు పేరుతో సచివాలయం పడగొట్టి వందల కోట్లు వృథా చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రిమండలిలో ఐదేళ్లపాటు ఒక్క మహిళకూ స్థానంలేదని, ఎనిమిదేళ్లుగా గ్రామపంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. 

హుజూరాబాద్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంచారని ఆరోపించారు. అయితే, హుజూరాబాద్ లో డబ్బు పంచకుండానే మంచి మెజారిటీతో తాము గెలిచామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
TRS Govt
BJP
Hyderabad
Telangana

More Telugu News