భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్.. తొలి టీ20లో సఫారీల ఘన విజయం

Miller and Rassie blitz help SA hunt down 211
టీ20ల్లో 12 వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. మరొక్క మ్యాచ్ గెలిచి రికార్డు సృష్టించాలనుకున్న భారత్ జట్టు ఆశలను చిదిమేశారు. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గతరాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. డుసెన్, డేవిడ్ మిల్లర్ భారత బౌలర్లను చీల్చి చెండాడి జట్టుకు ఘన విజయాన్ని అందించి పెట్టారు. డుసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేయగా, మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. 

అంతకుముందు ప్రిటోరియస్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆడింది 13 బంతులే అయినా ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. క్వింటన్ డి కాక్ 22, కెప్టెన్ తెంబా బవుమా 10 పరుగులు చేశారు. మిల్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గైక్వాడ్ 23, శ్రేయాస్ అయ్యర్ 36, కెప్టెన్ పంత్ 29, హార్దిక్ పాండ్యా 31 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో మహారాజ్, నార్జ్, పార్నెల్, ప్రిటోరియస్‌ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ నెల 12న కటక్‌లోని బారాబతి స్టేడియంలో రెండో టీ20 జరుగుతుంది.
Go Back to Shorts
South Africa
Team India
Ishan Kishan
David Miller
Rassie van der Dussen
Arun Jaitley Stadium

More Telugu News