బీసీసీఐకి కాసుల వర్షం: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లకు బిడ్లు.. రూ. 5 వేల కోట్లకు పైగా ఆదాయం!

BCCI announces release of tender to own and operate IPL team
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే సీజన్‌లో కొత్తగా మరో రెండు జట్లు వచ్చి చేరబోతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న 8 జట్ల సంఖ్య 10కి పెరగనుంది. అలాగే, మొత్తంగా 74 మ్యాచ్‌లు ఉంటాయి. రెండు కొత్త జట్లకు సంబంధించి బీసీసీఐ నిన్న బిడ్లను ఆహ్వానించింది. కొత్త ఫ్రాంచైజీ ఒక్కో దానికి బేస్ ప్రైస్ రూ. 200 కోట్లు ఉండాలని నిర్ణయించారు. ఫలితంగా బీసీసీఐ ఈ రెండు జట్ల ద్వారా ఏకంగా రూ. 5 వేల కోట్లకు పైనే ఆర్జించనుంది. నిజానికి కొత్త జట్ల బేస్ ప్రైస్‌ను తొలుత రూ. 1700 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత సవరించి రూ. 2000 కోట్లుగా నిర్ణయించినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయినా బిడ్ పత్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కనీసం రూ. 3000 కోట్లు ఉన్న కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, కన్సార్షియంగా అంటే మూడు కంపెనీలు ఒక సంస్థగా ఏర్పడి కూడా బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చు. మూడు కంటే ఎక్కువ కంపెనీలు మాత్రం ఒకటిగా ఏర్పడేందుకు అనుమతించే అవకాశం లేదు.

కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో, పూణెల నుంచి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియాల సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఫ్రాంచైజీలు అటువైపే మొగ్గు చూసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, అదానీ గ్రూప్, ఆర్‌పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్, ప్రముఖ బ్యాంకర్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
Go Back to Shorts
BCCI
IPL 2020
Tender
Ahmedabad
Lucknow
Pune

More Telugu News