భారత్, చైనా సైనికులు.. జస్ట్​ 150 మీటర్ల దూరంలోనే!

Indian and Chinese deployments as close as just 150 meters
  • తూర్పు లడఖ్ ఘర్షణలో తీవ్రమైన పరిస్థితులు
  • ఆర్టిలరీ గన్నులు, ఆయుధ సామగ్రితో చైనా సైన్యం
  • అక్కడికి కొద్ది దూరంలోనే భారత పోస్టులు
  • కొన్ని చోట్ల ఆ దూరం కేవలం 50 మీటర్లే
  • గూగుల్ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి
పేరుకు బలగాలను ఉపసంహరించుకున్నామని భారత్, చైనా చెబుతున్నా.. సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే మన దేశం 50 వేల మంది అదనపు బలగాలను సరిహద్దుల్లో మోహరించింది. అయితే, బలగాలను ఉపసంహరించుకునే నాటికి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అత్యంత తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

రెండు దేశాల సైనికులు అతి సమీపంలోనే మోహరించి ఉన్నారు. టెంట్లు, సైనిక పోస్టులు ఏర్పాటు చేశారు. ఎంతలా అంటే వాళ్ల సైన్యానికి, మన సైన్యానికి మధ్య కేవలం 150 మీటర్ల దూరం ఉందంతే. కొన్ని చోట్ల ఆ దూరం 50 మీటర్లు కూడా లేదు.

ఏడాది క్రితం తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగోంగ్ సరస్సు వద్ద రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో డ్రాగన్ సైనికులతో జరిగిన ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు సహా 22 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత చర్చలకు కూర్చున్న రెండు దేశాల ఆర్మీ అధికారులు.. బలగాల ఉపసంహరణకు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఫిబ్రవరి 11న సైనికులను వెనక్కు పిలిపించుకున్నారు. అయితే, అదే రోజు ఆ ప్రాంతంలో మన సైనికులు, చైనా సైనికుల మధ్య దూరం కేవలం 150 మీటర్లేనని తేలింది. ఇటీవలే గూగుల్ ఎర్త్ ప్రోలో దానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అప్ డేట్ చేశారు. పాంగోంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో రెజాంగ్ లా ఏరియా వద్ద భారత్, చైనా సైనికులు టెంట్లు, పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆ ఫొటోల్లో తేలింది. అయితే, కైలాష్ వంటి శ్రేణుల్లో ఆ దూరం కేవలం 50 మీటర్లే ఉందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ ప్రాంతంలో భారత్ కు చెందిన రెండు పెద్ద పోస్టులున్నట్టు ఫొటోల ద్వారా తెలుస్తోంది. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి భారత సరిహద్దుల్లోనే ఆ సైనిక పోస్టులను ఏర్పాటు చేశామని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, గూగుల్ ఎర్త్ మాత్రం మన సైనికులు వాస్తవాధీన రేఖ దాటి వెళ్లారని చూపిస్తున్నాయి. మన పోస్టులకు అల్లంత దూరంలోనే చైనా పోస్టులున్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది. ఆర్టిలరీ గన్నులు, ఇతర ఆయుధాలు, పరికరాలను చైనా అక్కడికి తరలించినట్టు తేలింది. ఫేస్ ఆఫ్ జరిగిన ప్రాంతం నుంచి జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మోహరింపులు జరిగాయని తేల్చాయి.
Go Back to Shorts
India
China
Ladakh
Army
Galwan Valley

More Telugu News