వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తులు ఎదుర్కొంటున్నాం: మోదీ
- మన్ కీ బాత్‌లో మోదీ ప్రసంగం
- కరోనా సంక్షోభం వేళ భారత్ రెండు తుపానులను ఎదుర్కొంది
- కరోనా, తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నాం
- విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను దిగుమతి చేసుకుంటున్నాం
'తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి పని చేశాయి. గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారి సేవలు అభినందనీయం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను' అని మోదీ వ్యాఖ్యానించారు.
'సంక్షోభ పరిస్థితుల్లో మహిళలు దేశానికి అందిస్తోన్న సేవలు మరవలేనివి. ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను మహిళా సిబ్బంది నడిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను దిగుమతి చేసుకుంటున్నాం' అని మోదీ చెప్పారు.
'దూర ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయటం కష్టంగా మారింది. క్రయోజనిక్ ట్యాంకర్ డ్రైవర్ల శ్రమ ద్వారా లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణ రోజుల్లో రోజువారీ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్ టన్నులుగా ఉండేది. అది ఇప్పుడు పది రెట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.