కరోనాతో పోరాడుతున్న భారత్ కు ఒక బిట్ కాయిన్ ను విరాళంగా ప్రకటించిన ఆసీస్ మాజీ క్రికెటర్

Brett Lee donates one bitcoin to India
  • భారత్ లో కరోనా సంక్షోభం
  • సునామీలో కేసులు, ఆందోళనకరంగా మరణాలు
  • భారత్ పరిస్థితి పట్ల చలించిపోయిన బ్రెట్ లీ
  • క్రిప్టో రిలీఫ్ సంస్థకు విరాళం
  • ఒక బిట్ కాయిన్= రూ.40,95,772
భారత్ లో కరోనా రక్కసి సృష్టిస్తున్న సంక్షోభం పట్ల అంతర్జాతీయ సమాజం తీవ్రంగా చలించిపోతోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ భారత్ లో ప్రస్తుత పరిస్థితుల పట్ల స్పందించాడు. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ కు ఒక బిట్ కాయిన్ విరాళంగా ఇస్తున్నట్టు బ్రెట్ లీ ప్రకటించాడు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక బిట్ కాయిన్ కు భారత కరెన్సీలో రూ.40,95,772 విలువ ఉంది. తన విరాళం గురించి బ్రెట్ లీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

"నా వరకు భారత్ ను ఎప్పటికీ మరో సొంతిల్లుగానే భావిస్తాను. నేను క్రికెటర్ గా ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రస్తుతం మహమ్మారి ధాటికి భారత ప్రజలు విలవిల్లాడుతున్న తీరు తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల స్పందించి నా వంతుగా సాయం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాను భారత్ లో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం ఒక బిట్ కాయిన్ ను క్రిప్టో రిలీఫ్ (www.cryptorelief.in) సంస్థకు విరాళంగా ఇస్తున్నాను.

ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి అందరం ఏకమవ్వాల్సిన సమయం ఇది. ఈ కష్టకాలంలో ముందుండి నిలిచి పోరాడుతున్న కొవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి" అని బ్రెట్ లీ పేర్కొన్నారు. అంతేకాదు, నిన్న భారత్ కోసం 50 వేల డాలర్లు విరాళం ప్రకటించిన తమ దేశానికే చెందిన ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ను బ్రెట్ లీ మనస్ఫూర్తిగా అభినందించాడు.
Go Back to Shorts
Brett Lee
India
Bitcoin
Corona Crisis
Australia

More Telugu News