Amazon: డ్రైవర్లు వాటర్​ బాటిళ్లలో మూత్రం పోయడం నిజమే.. క్షమాపణలు కోరిన అమెజాన్​

Amazon Admits Some Drivers In US Urinate In Bottles Apologises
షార్ట్స్‌లో చూడండి
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ క్షమాపణలు కోరింది. తమ ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం వాస్తవమేనని అంగీకరించింది. నిజానిజాలు తెలుసుకోకుండా అమెరికా చట్టసభ ప్రతినిధి వ్యాఖ్యలను తోసిపుచ్చామని పేర్కొంది. విస్కాన్సిన్ కు చెందిన డెమొక్రటిక్ ప్రతినిధి మార్క్ పోకన్ గత వారం అమెజాన్ పై ఓ ట్వీట్ చేశారు.

‘‘ఉద్యోగ సంఘాలు లేకుండా చేయడం, మీ ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం వంటివి ఉన్నంత కాలం.. ఉద్యోగులకు గంటకు 15 డాలర్లు ఇచ్చినా మీది గొప్ప సంస్థ అనిపించుకోదు’’ అంటూ పోస్ట్ పెట్టారు. అలబామాలోని అతిపెద్ద అమెజాన్ సెక్షన్ లో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అమెజాన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.

అయితే, వెంటనే ఆయన ట్వీట్ కు అమెజాన్ రిప్లై ఇచ్చింది. ‘‘ఎవరైనా వాటర్ బాటిళ్లలో మూత్రం పోస్తారా? అలా చేస్తే మా సంస్థలో ఎవరూ ఉద్యోగం చేయరు’’ అంటూ బదులిచ్చింది. అయితే, కొన్ని వార్తా సంస్థలు ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం చేస్తున్నారన్న విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాయి. తమకు బాటిళ్లలో మూత్రం పోయడం తప్ప వేరే మార్గం దొరకలేదంటూ వారు మీడియా సంస్థలతో గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు, అమెజాన్ లోని ఉన్నతాధికారులకూ ఈ విషయం తెలుసని ఆధారాలను బయటపెట్టాయి.

దీంతో అమెజాన్ దిగి వచ్చింది. మార్క్ పోకన్ కు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘మేం చేసిన ట్వీట్ తప్పు. మా సంస్థలో చాలా మంది డ్రైవర్లున్నారు. ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ల గురించి మాట్లాడుతున్నారనుకున్నాం. దానిపైనే వివరణ ఇచ్చాం. ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లలో ఎన్నో మరుగుదొడ్లు ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు’’ అని పేర్కొంది.

అయితే, డ్రైవర్ల విషయంలో మాత్రం బాటిళ్లలో మూత్రం పోస్తున్న మాట నిజమేనని తెలిపింది. చాలా మంది డ్రైవర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారని, ఆయా చోట్ల బాత్రూంలు టైంకు అందుబాటులో ఉండకపోవడం వల్లే బాటిళ్లలో మూత్రం పోస్తున్నారని వెల్లడించింది. ఇటు కరోనా సమయంలో చాలా ఓపెన్ బాత్రూంలను మూసేశారని, అది డ్రైవర్లు బాటిళ్లలో మూత్రం చేయడానికి కారణమవుతోందని పేర్కొంది.

అమెజాన్ వివరణకు పోకన్ అసహనం వ్యక్తం చేశారు. క్షమాపణలు తనకెందుకుని నిట్టూర్పు విడిచారు. ‘నేను మాట్లాడేది మీ ఉద్యోగుల గురించి’ అని అన్నారు. వారికి అమెజాన్ సరైన గౌరవం ఇవ్వట్లేదని మండిపడ్డారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించాలని, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, సంఘాల ఏర్పాటుకు సహకరించాలని అమెజాన్ కు సూచించారు.
Go Back to Shorts
Amazon
USA
Jeff Bezos

More Telugu News