తెలంగాణలో ప్రియురాలి ఆత్మహత్య.. దుబాయ్ లో ప్రియుడి బలవన్మరణం

23-01-2021 Sat 19:06
  • జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం
  • ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నా ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
  • ఆమెలేని జీవితం తనకు వద్దని ఉరి వేసుకున్న ప్రియుడు 
Lovers suicide in Telangana

తెలంగాణలోని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడు దుబాయ్ లో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని రాకేశ్ ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు.

ఇంతలోనే ఏమైందో కానీ నిన్న మనీషా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందనే వార్త విని రాకేశ్ తట్టుకోలేకపోయాడు. 'నీవు లేని జీవితం నాకు వద్దు. అమ్మా నన్ను క్షమించు. మిమ్మలను విడిచి వెళ్తున్నా' అని సెల్ఫీ వీడియో తీసుకుని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇలా ప్రేమికులు ఇద్దరూ చనిపోవడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా మనీషా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.