Rajanikanth: సెట్లో రజనీకాంత్ 14 గంటలు.. ఆశ్చర్యపోతున్న యూనిట్!

  • శివ దర్శకత్వంలో రజనీ హీరోగా 'అన్నాత్తే' 
  • రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్  
  • ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు సెట్లో రజనీ
  • ఎన్నికలకు ముందుగా విడుదల చేసే ప్లానింగ్
Rajanikanth works for Fourteen hours per day

తమిళనాట అశేష అభిమానులను సంపాదించుకుని, కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు కొంత జరిగింది. ఇప్పుడు మళ్లీ తదుపరి షెడ్యూలు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ షూటింగులో రజనీతో పాటు కథానాయికలు నయనతార, కీర్తి సురేశ్, ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని బయో బబుల్ పరిరక్షణలో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తున్నారు. వచ్చే వేసవిలో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పాల్గొంటున్నందున, ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందుగానే రిలీజ్ చేయాలని రజనీ భావిస్తున్నారు.

ఈ క్రమంలో షూటింగును త్వరగా పూర్తి చేయడానికి ఆయన చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అంటే రోజుకు 14 గంటల పాటు రజనీ షూటింగు చేస్తున్నారట. సంక్రాంతికి ముందుగానే తన షూటింగు పార్టును పూర్తి చేయాలని ఆయన ఇలా శ్రమిస్తున్నట్టు చెబుతున్నారు. ఓపక్క అనారోగ్య సమస్యలు వున్నప్పటికీ.. ఈ వయసులో ఆయన ఉత్సాహంగా అలా షూటింగ్ చేస్తుంటే యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు!

More Telugu News