రష్యా నుంచి కరోనాకు రెండో టీకా.. వెల్లడించిన పుతిన్

Russia ready to bring second covid vaccine
  • ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ‘స్పుత్నిక్-వి’
  • రెండో టీకాను అభివృద్ధి చేస్తున్న వెక్టార్ ఇనిస్టిట్యూట్
  • తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తి
ప్రపంచంలో అందరికంటే ముందుగా కరోనా టీకా 'స్పుత్నిక్-వి'ని అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రష్యా ఇప్పుడు మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

నిన్న జరిగిన ప్రభుత్వ సమావేశంలో ఈ విషయాన్ని పేర్కొన్న పుతిన్ రెండో టీకా అందుబాటులోకి రానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల ప్రారంభంలోనే ఈ టీకా తొలి దశ హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నట్టు చెప్పిన పుతిన్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు విదేశీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు అధ్యక్షుడు తెలిపారు.

కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 13,40,409 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో అమెరికా 81,50,043 కేసులతో అగ్రస్థానంలో ఉండగా, 73,05,070 కేసులతో ఇండియా రెండోస్థానంలో, 51,41,498 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. 85,622 కేసులతో చైనా 50వ స్థానంలో ఉంది.
Go Back to Shorts
Corona Virus
Corona vaccine
Russia

More Telugu News