21న బర్త్ డే పార్టీ... ఉసేన్ బోల్డ్ కు కరోనా... పార్టీలో క్రిస్ గేల్ సహా పలువురు సెలబ్రిటీలు!

Ussen Bolt Gets Corona Positive
  • ఇటీవల పుట్టిన రోజు పార్టీ చేసుకున్న బోల్డ్
  • పలువురు ప్రముఖుల హాజరు
  • కరోనా వచ్చిందని బోల్ట్ వీడియో
  • ఇప్పటికే పలువురు హోమ్ క్వారంటైన్
జమైకన్ స్ప్రింటర్, ఒలింపిక్స్ లో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించి, వేగంలో చిరుతపులి అని పేరు తెచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, కరోనా టెస్ట్ చేయించుకోవడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, తనకు వైరస్ సోకిందని అన్నారు.

ఇటీవల తన 34వ పుట్టిన రోజును జరుపుకున్న బోల్ట్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను అప్ లోడ్ చేస్తూ... "శుభోదయం... నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. శనివారం నాడు పరీక్షలు చేయించుకోగా, ఖరారైంది. దీంతో నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నా సన్నిహితులకు దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేవు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. కరోనా ప్రొటోకాల్ గురించి హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని వివరాలను కోరాలని భావిస్తున్నాను. నా దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలి" అని అన్నారు.

అయితే, తన పుట్టిన రోజునాడు ఆగస్టు 21న పలువురిని ఉసేన్ బోల్ట్ కలిశారు. నాడు ఏర్పాటు చేసిన పార్టీలో భౌతిక దూరం కనిపించకపోగా, కనీసం మాస్క్ లను కూడా ఎవరూ ధరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి హాజరైన వారందరిలోనూ ఆందోళన నెలకొంది. 21న బోల్ట్ ను కలిసిన వారిలో పలువురు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. నాడు ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్ లతో పాటు బేయర్ లెవెర్కుసేన్, అటాకర్ లియాన్ బెయిలీ తదితరులు కూడా పార్టీకి వెళ్లడం గమనార్హం.
Go Back to Shorts
Ussen Bolt
Corona Virus
Chris Gayle
Jamaica

More Telugu News