ys veveka: వైఎస్‌ వివేకా హత్య కేసు: దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని విచారిస్తోన్న సీబీఐ అధికారులు

cbi probe in ys viveka case
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.

వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌ రెడ్డి పేరు కూడా ఉంది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలిలో వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు ఆయన కూడా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో శివశంకర్‌ రెడ్డిని 5 రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు విచారించారు. సిట్‌ అధికారులు ఈ కేసును ఛేదించలేకపోయారు. మరోవైపు శంకర్‌ రెడ్డిపై వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగిన తర్వాత కొందరు అనుమానితులతో ఆయన మాట్లాడినట్లు సునీత హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
Go Back to Shorts
ys veveka
CBI
Kadapa District

More Telugu News