విడాకుల కారణంగా సంపదను కోల్పోయినా... తన రికార్డును తానే బద్దలు కొట్టిన జెఫ్ బెజోస్!
- రెండేళ్లనాడు మెకెంజీకి 40 బిలియన్ డాలర్లు
- ఆ సంపదను తిరిగి సంపాదించుకున్న జెఫ్ బెజోస్
- గణనీయంగా పెరిగిన అమెజాన్ ఈక్విటీ విలువ
బుధవారం నాడు యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సంస్థ ఈక్విటీ విలువ 4.4 శాతం పెరిగి 2,879 డాలర్లకు చేరుకుంది. దీంతో బెజోస్ సంపద 171.6 బిలియన్ డాలర్లను తాకింది. మెకెంజీకి విడాకులు ఇచ్చే నాటికి, అంటే... సెప్టెంబర్ 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్లని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. విడాకుల తరువాత ఆయన ఆస్తిలో 40 బిలియన్ డాలర్లకు పైగా భార్యకు ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి రెండేళ్లలోపే ఆయన ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకున్నారు. దీంతో తన సంపద రికార్డును తానే బద్దలు కొట్టినట్లయింది.
ఇదే సమయంలో ఆయన భార్య మెకంజీ ప్రపంచంలోనే రెండవ సంపన్న మహిళగా నిలవడం గమనార్హం. విడాకుల తరువాత ఆమెకు అమెజాన్ లో 4 శాతం వాటాలు దక్కగా, దీని విలువ 56.9 బిలియన్ డాలర్లు. తొలి మహిళగా లోరియల్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ అత్యంత ధనవంతురాలైన మహిళగా ఉన్నారు.