ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటేసిన కరోనా మరణాలు!
- శనివారానికి మృతుల సంఖ్య 2,03,274
- మొత్తం కేసుల సంఖ్య 29,21,030
- పలు దేశాల్లో నిదానంగా తగ్గుతున్న కరోనా ఉద్ధృతి
యూఎస్ లో కరోనా కొత్త కేసుల సంఖ్య సగటున 38 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయని, కొన్ని రాష్ట్రాల్లో ఇది 15 శాతానికి పడిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇకపై రోజుకు 5 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయాలని హార్వార్డ్ వర్శిటీ సలహా ఇచ్చింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న న్యూయార్క్ లో కేసుల సంఖ్య 2.88 లక్షలకుపైగా నమోదు కాగా, మృతుల సంఖ్య 21,908కు చేరింది.
ఇదే సమయంలో ఆసియాలో కరోనా తగ్గుముఖం పట్టింది. చైనాలో వరుసగా పదో రోజు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కొత్తగా 12 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఆసుపత్రుల్లో 838 మంది, హోమ్ క్వారంటైన్ లో సుమారు 1000 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో కేవలం రెండు రోజుల వ్యవధిలో 60 మంది నావికాదళ సిబ్బందికి వైరస్ పాజిటివ్ రాగా, దాదాపు 4 వేల మంది ఉద్యోగులను, వారి కుటుంబీకులను క్వారంటైన్ చేశారు.
స్పెయిన్ లో బడులను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం, పిల్లలను పంపించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేసింది. బ్రిటన్ లో మరణాల సంఖ్య 20 వేలను దాటింది. ఇజ్రాయెల్ కరోనా కట్టడిలో మెరుగైన ఫలితాలను నమోదు చేస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 15 వేలను దాటగా, కోలుకున్న వారి సంఖ్య 6 వేలను దాటడం విశేషం.