ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే
- ఈ సవరణ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి చేయలేదు
- ప్రధాని మోదీ కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఎస్పీజీ భద్రత ఉండదు
- గాంధీ కుటుంబంతో పాటే 130 కోట్ల మంది భారతీయుల రక్షణ ముఖ్యమేనన్న అమిత్ షా
‘ఎస్పీజీ సవరణ బిల్లును కేవలం గాంధీల కుటుంబం కోసం చేయటంలేదు. వారి కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని సవరణ చేసిందికాదు. ఈ చట్టాన్ని సవరించడం ఐదోసారి. ఒక్కటి మాత్రం నిజం, గతంలో ఈ చట్టానికి చేసిన సవరణలు పక్కా వారి కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవే. మేము వారికి సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాం. వారు భూమి మీదనే అత్యధిక భద్రతను కలిగివున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఎస్పీజీ భద్రత ఉండదు. గాంధీ కుటుంబానికే కాక, ఇతర మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత తొలగించిన విషయాన్ని గమనించాలి’ అని అమిత్ షా వివరించారు.