చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని జగన్ కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు!: బీజేపీ నేత సుజనా చౌదరి
- టీడీపీ, వైసీపీ వరద బాధితుల్ని పట్టించుకోవట్లేదు
- ఫ్లడ్ మేనేజ్ మెంట్ వైసీపీ ప్రభుత్వానికి చేతకావట్లేదు
- విశాఖలో మీడియాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు
ప్రాజెక్టుల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని సుజనా చౌదరి హెచ్చరించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన కారణంగా ఏపీకి పరిశ్రమలు రావని అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచమంతా ఆర్థికమాంద్యంపై భయపడుతున్న తరుణంలో జగన్ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్డీయే విధానాలను విభేదించిన తరహాలో వైసీపీ వ్యవహరిస్తే బాగుండేది.
ఏపీ, తెలంగాణకు వరద వస్తుందని కర్ణాటక ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయింది’ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నిలిపివేత, ఉపాధి హామీ పనులు ఆగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్తంభించిందనీ, ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.