ఆఖరికి ఢిల్లీ చేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్!
- ఈరోజు ఉదయం 8 గంటలకు దేశరాజధానికి
- ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
- నిన్న రైలును నిలిపివేసిన పాకిస్థాన్ అధికారులు
సాధారణంగా ఈ రైలు వాఘా సరిహద్దుకు వచ్చేసరికి భారత్ అధికారులు మన భూభాగంలోని అటారీ స్టేషన్ నుంచి ఇంజిన్, సిబ్బందిని పంపిస్తారు. బోర్డర్ నుంచి మన సిబ్బంది ఆధ్వర్యంలో రైలు ప్రయాణం సాగుతుంది. ఇందుకు పాకిస్థాన్ అధికారులు నిరాకరించడంతో కొన్ని గంటలపాటు సరిహద్దులోనే రైలు నిలిచిపోయింది. దీంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది.
ఎట్టకేలకు అనుమతి లభించడంతో భారత్ అధికారులు అటారి స్టేషన్ నుంచి ఇంజిన్, సిబ్బందిని పంపి రైలును అటారి స్టేషన్‌కు నిన్న రాత్రి తీసుకువచ్చారు. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఈరోజు తెల్లవారు జామున రైలు ఢిల్లీకి బయలుదేరింది. దీంతో నాలుగున్నర గంటల ఆలస్యంతో ఈ ఉదయం 8 గంటలకు రైలు ఢిల్లీ చేరడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.