Chandrababu: నాపై బురద చల్లినంత మాత్రాన ప్రత్యేక హోదా వస్తుందా?: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చకు దారితీసింది. ఓవైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం వాగ్బాణాలు సంధించుకోవడంతో సభలో సెగలుపొగలు రగులుతున్నాయి. దానికితోడు, ఇతర నేతల వ్యాఖ్యలు కూడా సభలో ఉద్రిక్తభరిత వాతావరణానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో, తనపై అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు దీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్లానింగ్ కమిషన్ వెళ్లిపోయేవరకు ప్రత్యేకహోదాపై చంద్రబాబు స్పందించలేదని, ప్లానింగ్ కమిషన్ కు చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని జగన్ ఆరోపించగా, ఆ వ్యాఖ్యలు వాస్తవం కాదని చంద్రబాబు బదులిచ్చారు. ప్లానింగ్ కమిషన్ వద్దకు తాను వెళ్లి ప్రయత్నం చేయలేదన్న మాట తప్పుడు ఆరోపణ అని అన్నారు.

"ప్లానింగ్ కమిషన్ పేరుతో నాపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. నామీద బురద చల్లినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. మీరు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్నారు కదా, సాధించండి. జగన్ మోహన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు కదా, వాళ్లతో ప్రత్యేక హోదా సాధించమనే చెబుతున్నాం. ప్రత్యేకహోదా కోసం టీడీపీ ప్రయత్నాలను తప్పుబట్టడం సరికాదు. బీజేపీతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారితో విభేదించాం. అప్పట్లో మేం శాలువాలు కప్పామని, మెమెంటోలు ఇచ్చామని అంటున్నారు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కూడా శాలువాలు, మెమెంటోలే ఇస్తున్నారు, వచ్చే ఐదేళ్లలో మీరు ఇచ్చేవాటితో బీరువాలు, రూములు కూడా నిండిపోతాయి " అంటూ చంద్రబాబు ఓ సెటైర్ తో తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News