ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని యాసిడ్ పోసిన ప్రియురాలు!

  • గత వారం న్యూఢిల్లీలో ప్రేమజంటపై దాడి
  • క్లూ లభించక వారినే ప్రశ్నించిన పోలీసులు
  • ప్రియురాలి కుట్ర బట్టబయలు
తనను కాదన్నదనో, ప్రేమను అంగీకరించలేదనో, మరో ఇతర కారణం చూపో, ఏంతో మంది అమ్మాయిలపై మృగాళ్లుగా మారిన అబ్బాయిలు యాసిడ్ దాడులు జరిపిన సందర్భాలను ఎన్నో చూశాం. కానీ, ఈ ఘటన దానికి భిన్నం. వారం రోజుల క్రితం బైక్ పై వెళుతున్న జంటపై యాసిడ్ దాడి జరుగగా, కేసును విచారించిన పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ దాడికి యువకుడి వెనుక కూర్చున్న యువతే కారణమని, తేల్చారు.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వెనుక పూర్వాపరాల్లోకి వెళితే, యువతీ యువకులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండగా, గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని ఆమె అడుగుతూ ఉండటంతో యువకుడు నిరాకరిస్తూ వచ్చాడు. మనిద్దరమూ విడిపోదామని కోరాడు. అతని మాటలను తట్టుకోలేకపోయిన ఆమె, అతనిపై యాసిడ్ పోయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 11వ తేదీన ఇద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. "నీ ముఖం నాకు సరిగా కన్పించడం లేదు. హెల్మెట్‌ తీసేయి" అని ఆమె అడుగగా, హెల్మెట్ తీసి బైక్ ను నడపడం ప్రారంభించాడా యువకుడు.

ఆ సమయంలో తనతో తెచ్చుకున్న యాసిడ్ ను అతనిపై చల్లింది. ఈ ఘటనలో అతనికి మెడ, గొంతు, ముఖంపై గాయాలు కాగా, యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చి కేసు విచారణ ప్రారంభించిన పోలీసులకు ఒక్క క్లూ కూడా లభించలేదు. చివరకు వారినే ప్రశ్నిస్తుండగా, తన ప్రియురాలు హెల్మెట్ తీయాలని కోరిందని, ఆపై దాడి జరిగిందని ప్రియుడు చెప్పగా, ఆమెను గట్టిగా నిలదీసేసరికి అసలు విషయం చెప్పింది. పెళ్లికి నిరాకరించడంతోనే ఈ పని చేశానని చెప్పగా, ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు పోలీసులు.
Go Back to Shorts
Lovers
Acid Attack
Crime News
New Delhi
Police

More Telugu News