Hyderabad: విఫలమైన ఫేస్‌బుక్ ప్రేమ.. ఉరేసుకున్న సెక్యూరిటీ గార్డు

షార్ట్స్‌లో చూడండి
ఫేస్‌బుక్ ప్రేమకు ఓ యువకుడు బలయ్యాడు. తన ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  అసోంకు చెందిన బిద్యుత్‌ సైకియా(24) మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తనకు సోదరుడి వరుసైన ప్రమోద్ సైకియా, దీపెన్ సైకియాలతో కలిసి రాయదుర్గం మధురానగర్‌లో ఉంటున్నాడు.

గురువారం రాత్రి మిగతా ఇద్దరూ విధులకు వెళ్లగా, బిద్యుత్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. విధులకు వెళ్లిన వారు ఉదయం తిరిగి రాగా,  తలుపు గడియపెట్టి ఉంది. ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపలి దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. మణికట్టు వద్ద కత్తిగాటు చేసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయితో గత కొంతకాలంగా బిద్యుత్ ప్రేమలో ఉన్నాడని, పెళ్లికి ఆమె నిరాకరించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని సోదరుడు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు.  
Go Back to Shorts
Hyderabad
Assam
Facebook love
Suicide

More Telugu News