Tirupati: యువకుడిపై ప్రత్యర్థుల దాడి.. రక్తమోడుతున్న బాధితుడ్ని కాపాడిన బస్సు డ్రైవర్!

షార్ట్స్‌లో చూడండి
తిరుపతి రూరల్ మండలంలో ఓ క్రైమ్ సీన్ సినిమాల్లో చూపించినట్టే జరిగింది! తిరుచానూరు యోగిమల్లవరానికి చెందిన మదన్ కుమార్ అనే యువకుడు బైక్ పై వెళుతుండగా ప్రత్యర్థులు కాపుకాసి రామానుజపల్లె చెక్ పోస్టు వద్ద దాడికి దిగారు. మదన్ కుమార్ ను కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. దాదాపు 9 కత్తిపోట్లు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. అయితే, బతుకుపై తీపితో బైక్ వదిలేసిన ఆ యువకుడు రోడ్డుపై పరుగులు పెట్టాడు. అటుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు వెంబడి పరుగుతీశాడు. మదన్ కుమార్ పరిస్థితి గమనించిన డ్రైవర్ బస్సును ఆపి అతడ్ని ఎక్కించుకున్నాడు.

అయితే, మదన్ ను చంపేందుకు వచ్చిన వ్యక్తులు బస్సును కూడా వెంటాడడంతో ఆ డ్రైవర్ ఒక్కసారిగా స్పీడు పెంచి దూసుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మదన్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో అతడి ప్రాణాలు నిలిచినట్టు వైద్యులు తెలిపారు.

కాగా, మదన్ కుమార్ కూడా తక్కువవాడేమీ కాదని తెలుస్తోంది. గతంలో కార్వేటినగరంలో జరిగిన జంట హత్యల్లో ఇతని పాత్ర ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యల నేపథ్యంలోనే ప్రత్యర్థులు మదన్ కుమార్ ను అంతమొందించడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Tirupati

More Telugu News