చిత్తూరు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన బైక్.. అక్కడికక్కడే ఇద్దరి మృతి!

  • జిల్లాలోని వి.కోట మండలంలో ఘటన
  • వేగంగా వెళుతూ అదుపుతప్పిన వాహనం
  • ఆసుపత్రికి తరలింపు.. అప్పటికే చనిపోయారన్న వైద్యులు
వేగంగా వెళుతున్న బైక్ అదుపు తప్పడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బైక్ వేగంగా చెట్టును ఢీకొట్టడంతో దానిపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.

జిల్లాలోని వి.కోట మండలం హనుమంతనగర్ వద్ద ఇద్దరు ప్రయాణిస్తున్న ఓ బైక్ అదుపుతప్పింది. దీంతో వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అటుగా వెళుతున్న వాహనదారులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. కాగా, ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. మృతులు వి.కోట మండలం ముదారందొడ్డి గ్రామానికి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chittoor District
Road Accident
Police
2 dead

More Telugu News