Chandrababu: చంద్రబాబును చూసి మోదీ భయపడే రోజులివి: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఎవరూ భయపెట్టించలేరని, బాబును చూసి కేంద్రంలో మోదీ భయపడే రోజులివని మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిప్పులాంటి వ్యక్తి, మచ్చలేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయనపై 28 కేసులు పెడితే ఏ ఒక్కటీ నిలబడలేదని, అలాంటి వ్యక్తి బాబు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీపై ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ అదొక అద్భుతమైన డ్రామా కంపెనీ అని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు ‘రాజీనామా డ్రామా’ ఆడారని, కేంద్రంతో వైసీపీ రాజీ పడి, ఏపీ ప్రజలకు నామం పెట్టారని విమర్శించారు.

ఈ డ్రామా ప్లాప్ కావడంతో రెండో డ్రామా ఆడారని, ‘కోడికత్తి డ్రామా’ అని, ‘పాపం కోడి కూడా అనుకుంటుంది. నేను(కోడి) కట్టుకున్న కత్తి నా వల్ల కాదు, జగన్ మోహన్ రెడ్డి వల్ల బాగా పాపులర్ అయిందని’ అంటూ సెటైర్లు విసిరారు. ‘స్క్రిప్ట్ ఎవరు రాశారు? ఢిల్లీ పెద్దలు రాశారు. యాక్షన్ జరిగింది విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ, వైకాపా నాయకులు తిట్టేదెవరిని? చంద్రబాబునాయుడుగారిని. ఇక్కడ, చంద్రబాబునాయుడుగారికి ప్రమేయం ఏమన్నా ఉందా?’ అని ప్రశ్నించారు. జగన్ పై దాడి ఘటనపై ఇక్కడి పోలీసులతో దర్యాప్తు వద్దు కానీ, జగన్ సెక్యూరిటీకి మాత్రం మన పోలీసులు కావాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ను దింపారని, వాళ్లు దర్యాప్తు చేసి కొత్తగా ఏమీ చెప్పలేదని విమర్శించారు.

ఇక, మూడో డ్రామా.. ‘‘ఆవు- అంబులెన్స్ డ్రామా’. విజయనగరం జిల్లాలో ఓ సభలో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఓ మాట అన్నారు. ‘‘108’కు ఫోన్ కొడితే అంబులెన్స్ రావట్లేదు’ అని ఆయన అన్నారు. అప్పుడే, అంబులెన్స్ వచ్చింది. దీంతో, ఆయనకు కొంచెం కాలింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంకో సభలో ఆ ఆవు వచ్చింది. ఆ ఆవును పట్టుకుని ‘ఇది తెలుగుదేశం పార్టీ ఆవు. ఈ ఆవును చంద్రబాబునాయుడుగారు నా సభకు పంపించారు’ అని జగన్ అన్నారు. అంటే, ఆవును చూసినా, అంబులెన్స్ ను చూసినా చంద్రబాబునాయుడుగారే ఆయనకు గుర్తొస్తారు. ఆంధ్రా ప్రజలను చూసినా చంద్రబాబునాయుడు గారే ఆయనకు గుర్తొస్తున్నారు’ అని చమత్కరించారు.
Go Back to Shorts
Chandrababu
modi
Nara Lokesh
Jagan
YSRCP

More Telugu News