ఇరవై నాలుగు గంటలూ వీళ్లనూ, వాళ్లనూ తిట్టడమేనా మీ పని?: చంద్రబాబుపై కన్నా ఫైర్

  • ఈ ఐదేళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి
  • కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారు 
  • చంద్రబాబును పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో చంద్రబాబుకు దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు.

ఇరవై నాలుగు గంటలూ వీళ్లను తిట్టడం, వాళ్లను తిట్టడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరినీ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబును పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాఫెల్ వ్యవహారంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేశాయని, ప్రధాని మోదీకి ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రక్షణ వ్యవస్థను ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. రాఫెల్ లావాదేవీలు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
Go Back to Shorts
kanna
bjp
Andhra Pradesh
Chandrababu

More Telugu News