చనిపోయిన వ్యక్తి పేరుపై మూడు బ్యాంకు ఖాతాలు.. రూ.460 కోట్ల లావాదేవీలు.. పాక్ బ్యాంకుల లీలలు!
- పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న మనీ లాండరింగ్ కేసులు
- ప్రజల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న బ్యాంకు అధికారులు
- కోట్ల రూపాయల లావాదేవీలు
కరాచీకి చెందిన ఇక్బాల్ అరయాన్ 9 మే 2014లో మృతి చెందాడు. అతడు మరణించిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరిట మూడు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా రూ.460 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) విచారణలో బయటపడింది. అంతేకాదు, బ్యాంకు అధికారులే ప్రజల పేరు మీద ఖాతాలు తెరిచి భారీ మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. ఇటీవల ఇటువంటి కేసులు పాక్‌లో ఎక్కువయ్యాయి. ఓ చిరు వ్యాపారి ఖాతాలో ఒక్కసారిగా రూ.200 కోట్లు వచ్చిపడ్డాయి. ఓ ఆటో డ్రైవర్ ఖాతా ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.5 కోట్ల లావాదేవీలు జరిగాయి.