Andhra Pradesh: వాళ్లూ ఇలాగే చెప్పారు.. అసలు మిమ్మల్ని ఎలా నమ్మాలి?: పవన్‌కు ఝలక్కిచ్చిన మహిళ

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్టణం పరిధిలోని గంగవరం గ్రామాన్ని సందర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ మహిళ ఝలక్కిచ్చింది. గ్రామాన్ని సందర్శించిన పవన్ మాట్లాడుతూ.. అధికారులను గ్రామాల్లోకి రానీయవద్దని, వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. కిడ్నీ, చర్మ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసే తానిక్కడకు వచ్చానని తెలిపారు. టీడీపీ, బీజేపీలు ప్రజా సమస్యలను అటకెక్కించాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామంలో కిడ్నీ సమస్యలతో మంచం పట్టిన బాధితులను పవన్ పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఓ మహిళ పవన్ కల్యాణ్‌ను నిలదీసింది. ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మీరొచ్చారని పేర్కొంది. వారిలాగే మీరు కూడా హామీలతో సరిపెట్టరని గ్యారెంటీ ఏంటని, మిమ్మల్ని మాత్రం ఎలా నమ్మాలని ప్రశ్నించడంతో పవన్ అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆమెకు సమాధానం ఇస్తూ.. సమస్యల పరిష్కారం కోసమే తానిక్కడకు వచ్చానని, అందరూ ఐక్యంగా ఉండి సహకరిస్తే పరిష్కరిస్తానని అన్నారు. సమస్య పరిష్కరించాకే తనకు ఓటు వేయాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Pawan Kalyan
Janasena

More Telugu News