yalamanchali ravi: రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం!: యలమంచిలి రవి
వివాదాలకు అతీతంగా అందరి సహకారంతో వైసీపీ గెలుపు కోసం ఉద్యమిస్తానని మాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవి స్పష్టం చేశారు. యలమంచిలి తన శ్రేణులతో ఎల్లుండి వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో వైసీపీ నేతలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ, నాటి రాజశేఖరరెడ్డి పరిపాలన కావాలంటే, పేదలకు అన్నీ దక్కాలంటే జగన్ ముఖ్యమంత్రి కావలసిందేనని అభిప్రాయపడ్డారు. పాదయాత్రతో అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రానున్నఎన్నికలలో టీడీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కబోదని జోస్యం చెప్పారు.
తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీగానే వ్యవహరిస్తూ వచ్చిందని, క్షేత్ర స్థాయిలో చేసింది శూన్యమని దుయ్యబట్టారు. అనంతరం, గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ, యలమంచిలి రవి వైసీపీలో చేరనుండటం శుభపరిణామమని అన్నారు. వివాద రహితునిగా పేరుపొందిన యలమంచిలి తమకు అదనపు బలమేనన్నారు. రవి వంటి బలమైన నాయకుని ఆవశ్యకత విజయవాడ తూర్పు నియోజక వర్గానికి ఉందని, సరైన సమయంలో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.