లవ్‌లో పడ్డా... అందుకే చదవలేకపోయా.. పాస్ చేయండి సారూ: జవాబు పత్రంపై ఓ విద్యార్థి వినతి..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లవ్‌లో పడ్డా... అందుకే చదవలేకపోయా.. పాస్ చేయండి సారూ: జవాబు పత్రంపై ఓ విద్యార్థి వినతి..!

  • జవాబు పత్రంపై లవ్ స్టోరీ, లవ్ సింబల్ తప్ప మరేమీ రాయని ఇంటర్ విద్యార్థి
  • మీరు ఫెయిల్ చేస్తే, మా నాన్న చంపేస్తాడంటూ మరో విద్యార్థి వినతి
  • యూపీ బోర్డు పరీక్షల్లో జవాబు పత్రాలపై విద్యార్థుల వింత రాతలు
ఉత్తరప్రదేశ్ బోర్డు ఇంటర్నీడియట్ స్టూడెంట్ ఒకరు జవాబు పత్రంపై వింత రాతలు రాశాడు. ప్రేమలో పడి చదవలేకపోయానని, తనను పాస్ చేయాలని రాసి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. "ఐ లవ్ మై పూజ" అంటూ ఆ విద్యార్థి ధైర్యంగా తన కెమిస్ట్రీ పరీక్ష జవాబు పత్రంపై రాశాడు.

"ఈ ప్రేమ చాలా చిత్రమైనది. ఇది బతకనీయదు...చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు నేను సన్నద్ధం కాలేకపోయాను....నన్ను మీరే పాస్ చేయాలి" అంటూ ఆ విద్యార్థి రాశాడు. జవాబు పత్రంలో తన ప్రేమ రామాయణం, లవ్ సింబల్ తప్ప మిగిలిందంతా ఖాళీగా విడిచిపెట్టాడు. అతను మాత్రమే కాక యూపీలో ఇటీవల కాలంలో ఇలాంటి పిచ్చి ప్రేమరాతలు రాస్తున్న విద్యార్థులు ఎక్కువైపోతున్నారు.

దీనిపై ముజఫర్‌నగర్ జిల్లా పాఠశాలల తనిఖీ అధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ జవాబు పత్రాలతో పాటు కరెన్సీ నోట్లను జత చేస్తున్నారు. కొన్ని వినతిపూర్వకమైన సందేశాలను కూడా రాస్తున్నారని ఆయన చెప్పారు. మరో విద్యార్థి అయితే "నాకు అమ్మ లేదు. మీరు నన్ను ఫెయిల్ చేస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు" అంటూ జవాబు పత్రంపై అభ్యర్థించాడని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏడాది పాటు చదువుపై ధ్యాస పెట్టకుండా పరీక్షల సమయంలో ఇలాంటి రాతలు రాస్తున్న ఇలాంటి విద్యార్థులను ఎలా దారిలోకి తీసుకురావాలన్న దానిపై విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Muzaffarnagar
UP
UP Board’s intermediate exam

More Telugu News