ఎనిమిది మందిని పెళ్లాడి.. రూ.4.5 కోట్లకు ముంచేసిన నిత్య పెళ్లి కొడుకు!

  • వరుసపెట్టి 8 పెళ్లిళ్లు చేసుకున్నఘనుడు
  • కోట్లలో ముంచేసి పరారీ
  • ఇప్పటికే 18 మోసం కేసులు నమోదు
  • నిత్య పెళ్లికొడుకు కోసం గాలిస్తున్న పోలీసులు
వరుసగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని ఆ భార్యలను రూ.4.5 కోట్ల మేర ముంచిన నిత్య పెళ్లికొడుకు ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని వెల్లలూరుకు చెందిన బి.పురుషోత్తమన్ (57), ఉషారాణి భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల కుమార్తె ఉంది. ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఈ క్రమంలో కోయంబత్తూరులో పెళ్లి సంబంధాలు కుదిర్చే ఏజెన్సీని నిర్వహిస్తున్న మోహన్, వనజ కుమారితో పరిచయం పెంచుకున్న పురుషోత్తమన్, తన ప్రణాళికలను అమలు చేశాడు. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా చేసుకుని వరుస పెట్టి ఎనిమిది మందిని పెళ్లిళ్లు చేసుకున్నాడు.

చెన్నైకి చెందిన ఇందిరా గాంధీ (45) అనే లెక్చరర్‌ను మాయమాటలతో పెళ్లాడిన పురుషోత్తమన్ ఆమెను పూర్తిగా తన మాయలో పడేశాడు. ఆమెకు చెన్నైలో ఉన్న ఇల్లును అమ్మేసి కోయంబత్తూరులో కొనుక్కుందామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఇల్లు అమ్మగా వచ్చిన రూ.1.5 కోట్లను పురుషోత్తమన్ చేతిలో పెట్టింది. డబ్బులు చేతిలో పడడమే ఆలస్యం.. పురుషోత్తమన్ మాయమయ్యాడు. బాధితురాలు ఇందిరా గాంధీ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో పురుషోత్తమన్ నిజస్వరూపం బయటపడింది.

పోలీసుల విచారణలో బయటపడిన విషయాలు తెలిసి ఇందిరా గాంధీ విస్తుపోయింది. తనకంటే ముందు ముగ్గురిని, తన తర్వాత మరో నలుగురిని పెళ్లాడాడని తెలిసి అవాక్కయింది. తాను పెళ్లాడిన 8 మంది నుంచి మొత్తంగా రూ. 4.5 కోట్లను దండుకున్నట్టు తేలింది. కాగా, పురుషోత్తమన్‌పై ఇప్పటికే 18 మోసం కేసులు ఉండడం గమనార్హం. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
marriage
Tamilnadu
coimbatore

More Telugu News