భక్తురాలిని రక్షించిన బాబా

శిరిడీ సాయిబాబా మశీదులో వుంటూ గ్రామంలో తెచ్చుకున్న భిక్షను ఆహారంగా తీసుకుంటూసాధారణమైన జీవితాన్ని గడిపేవాడు. ఆయన మామూలు ఫకీరుకాదనీ ... దైవ స్వరూపమని భావించిన కొందరు ఆయన భక్తులుగా మారిపోయారు. సాయికి అవసరమైన ఏర్పాట్లు కొన్ని వాళ్లు చేసేవారు గానీ, ఆయన తన శరీరానికి ఎప్పుడు విశ్రాంతిని ఇచ్చేవాడు కాదు. తనకి బాగా పరిచయస్తులు ... తనని బాగా నమ్మినవారికి ఏదైనా ఆపద సంభవిస్తే సాయి తల్లడిల్లిపోయేవాడు.

ఆయన శూన్యంలోకి చూస్తూ కాస్త విచిత్రంగా ప్రవర్తించాడంటే ఎవరినో కాపడుతున్నాడని వాళ్లు గ్రహించేవారు. తన భక్తులు ఎంతదూరంలో వున్నా వాళ్లు పడుతున్న అవస్థలు వెంటనే ఆయనకి తెలిసిపోయేవి. ఆ క్షణమే ఆయన ఆ గండం నుంచి వారిని గట్టెక్కించేవాడు. అందుకు ఉదాహరణగా 'మైనతాయి' కి ఎదురైన అనుభవం గురించి చెప్పుకోవచ్చు. ఓ రోజున బాబా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ... ఆందోళనగా వుండటం ఆయన భక్తులు చూశారు. కానీ విషయమేవిటని అడిగే సాహసం చేయలేకపోయారు.

అదే సమయంలో తాను తన ఊరు వెళుతున్నట్టుగా బాబాకి రామగిర్ బువా చెప్పాడు. దాంతో బాబా వెంటనే ఆయనకి తన హారతి పాట - ఊదీ ఇచ్చి, 'జామ్నేర్' లోని నానాచందోర్కర్ కి అందజేయవలసిందిగా చెప్పాడు. తన వూరు నుంచి జామ్నేర్ చాలా దూరమనీ, అక్కడికి వెళ్లేందుకు అవసరమైన డబ్బు తన దగ్గర లేదని చెప్పాడు రామగిర్ బువా. అంతా సక్రమంగానే జరుగుతుందని చెప్పి అతన్ని పంపించివేశాడు బాబా. తన ఊరు చేరుకునే సరికి అర్థరాత్రి దాటడంతో , అక్కడి నుంచి జామ్నేర్ ఎలా వెళ్లాలో అర్థంకాక రామగిర్ బువా అయోమయంలో పడిపోయాడు.

అంతలో ఓ గుర్రపుబండి వచ్చి ఆయన దగ్గర ఆగింది. బాపూగిర్ ఎవరంటూ ఆ జట్కావాలా అడగడంతో, ఆ బండిని నానాచందోర్కర్ పంపించి ఉంటాడని భావించి దాంట్లో కూర్చున్నాడు. ఆయన ఊహించిన దానికన్నా వేగంగా ఆ గుర్రపుబండి జామ్నేర్ లోని నానాచందోర్కర్ ఇంటికి చేరుకుంది. అప్పటికి చాలాసేపటి నుంచి ఆయన కూతురు 'మైనతాయి' ప్రసవవేదన పడుతోంది. కాన్పు కష్టంగా మారడంతో అంతా కంగారు పడుతున్నారు. అంతటి బాధలోనూ ఆమె బాబానే స్మరించుకుంటోంది. బాబాను తలచుకుంటూ నానాచందోర్కర్ హాల్లో ఆదుర్దాతో పచార్లు చేస్తున్నాడు.

ఇంతలో రామగిర్ బువా వచ్చి బాబా పంపించాడంటూ హారతి పాట - విభూతి ఇచ్చాడు. ఆ మాటతో నానాచందోర్కర్ కి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. సమయానికి బాబా హారతి పుస్తకం కనిపించక పోవడంవలన .. ఆయన గతంలో ఇచ్చిన విభూతి అయిపోవడం వలన అంతకుముందే నానాచందోర్కర్ అసహనానికి లోనయ్యాడు. వెంటనే విభూతిని కూతురు మైనతాయి నుదుటున పెట్టించి ... హారతి పుస్తకం అందుకుని చదవడం మొదలుపెట్టాడు. అంతే మైనతాయికి సుఖప్రసవం జరిగింది.

సమయానికి ఆయన బాబా విభూతిని అందజేయడం వల్లనే తన కూతురికి గండం గడిచిందని రామగిర్ బువాకి నానాచందోర్కర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన జట్కా పంపించడంవల్లనే తాను సమయానికి రాగలిగానని అన్నాడు రామగిర్ . ఆ మాటకి ఆశ్చర్యపోయిన నానాచందోర్కర్ తాను ఎవరినీ పంపించలేదని అన్నాడు.

ఇద్దరూ అయోమయానికి లోనవుతూ వసారాలోకి వచ్చి చూశారు. అక్కడ జట్కా లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. జట్కావాలా తనని బాపూగిర్ అని పిలిచాడనీ, అలా ఒక్క సాయిబాబా మాత్రమే తనని పిలుస్తాడని చెప్పాడు రామగిర్. జరిగినదంతా సాయిలీలగా నిర్ధారించుకుని ఆయనకి మనసులోనే వాళ్లు కృతజ్ఞతలు తెలియజేశారు.


More Bhakti News