పదునెట్టాంబడి

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు, అత్యంత నియమ నిష్టలతో దీక్షను పూర్తి చేసి 'శబరిమల' చేరుకుంటారు. స్వామివారి సన్నిధానానికి చేరుకోవాలంటే వీళ్లు 'పదు నెట్టాంబడి' పేరుతో పిలవబడే 18 మెట్లను ఎక్కవలసి వుంటుంది. ఈ 18 సోపానాలు అత్యంత పవిత్రమైనవిగా ... శక్తి మంతమైనవిగా భక్తులు భావిస్తుంటారు.

18 సోపానాలని స్పర్శించడం ద్వారా సమస్త పాపాలు హరించబడతాయని విశ్వసిస్తారు. తాము చేసిన మాలధారణకు పరమార్థం సిద్ధించేది ఈ సోపానాలను అధిరోహించినప్పుడు మాత్రమేనని నమ్ముతుంటారు. నలభై అడుగుల ఎత్తుగల పీఠాన్ని అయ్యప్ప స్వామి అధిరోహించడం కోసం 18 మంది అధిదేవతలు 18 సోపానాలుగా మారారని పురాణాలు చెబుతున్నాయి.

ఆ 18 మంది దేవతలుగా 'చండిక' ... 'అన్నపూర్ణ' ... 'భద్రకాళి' ... 'భైరవి' ... 'సుబ్రహ్మణ్యే శ్వర' ... 'గంధర్వ' ... 'కార్త వీర్య' ... 'తృషనా భాయ' ... 'శృతి బేధక' ... 'కటు శబ్దక' ... 'యుడుంబు' ... 'భేతాళ' ... ' హరిప్రియ' ... 'కర్ణ పిశాచి' ... 'పుళిందిని' ... 'రేణుక' ... 'ప్రదీపిక' ... 'ప్రత్యంగిరా' చెప్పబడుతున్నారు.

మాలధారణ చేయని వారికి ఈ మెట్ల మీదుగా ప్రవేశం వుండదు. అలాగే 15 రోజులు ... 21 రోజుల దీక్ష తీసుకునే వారు ఈ మెట్ల దారిలో స్వామి సన్నిధానానికి చేరుకునే అర్హతను కోల్పోతారని అంటారు. మండల దీక్ష తీసుకుని ఇరుముడి కలిగిన భక్తులకు మాత్రమే ఈ సోపానాల మీదుగా స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు.


More Bhakti News