రామ మంత్రం

కబీర్ దాసు కారణ జన్ముడు ... అందువల్లనే మహమ్మదీయుల కుటుంబంలో జన్మించిన ఆయన, శ్రీరామచంద్రుడిని ప్రత్యక్షంగా దర్శించగలిగాడు. కబీర్ దాసుకి చిన్నప్పటి నుంచే భక్తి భావం ఎక్కువ. నేతపనిలో తండ్రికి సహకరించే ఆయన, దైవ ధ్యానంలోకి వెళ్లిపోయేవాడు. ఆ కారణంగా ఆగిపోయిన పనిని దేవుడే పూర్తిచేసేవాడని చెబుతారు.

అంతటి భక్తుడైన కబీర్, శ్రీ రాముడిని పూజిస్తున్న కారణంగా కులగురువులు ఆయనను దూరం పెట్టారు. అలాగే హిందువులు ఆయనలోని రామభక్తుడిని స్వాగతించలేకపోయారు. ఈ రెండు విషయాల గురించి కాకుండా, రాముడి గురించి మాత్రమే కబీర్ ఆలోచన చేసేవాడు. గురువు వల్లనే ఆత్మజ్ఞానం అలవడుతుందని భావించిన కబీర్, ఆ గురువు వల్లనే శ్రీ రాముడికి సంబంధించిన మంత్రోపదేశం పొందాలని నిర్ణయించుకున్నాడు.

అందుకు శ్రీ రామానంద తీర్థులు మాత్రమే తగిన వారిగా భావించి గంగానది తీరానికి చేరుకున్నాడు. అదే సమయంలో స్నానానికి అక్కడికి వచ్చిన రామానంద తీర్థుల వారు ముందుకు తూలడంతో ఆయన కాలు కబీర్ ను తాకింది. అందుకు రామానంద తీర్థులు నొచ్చుకుంటూ ''రామ రామ '' అన్నారు. అంతే అదే ఆయన తనకి ఉపదేశించిన తారకమంత్రంగా కబీర్ భావించి ఆయన పాదాలకి నమస్కరించాడు.

'రామ' అనే శబ్దం మహా శక్తిమంతమైన మంత్రమనీ, అది సకల పుణ్య ఫలాలాను అదించగలదని ఆయన విశ్వసించాడు. రామ నామం సమస్త పాపాలను తొలగించి వేసి, మోక్షాన్ని ప్రసాదిస్తుందని గ్రహించాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన ఆ మంత్రాన్ని విడవకుండా జీవితాంతం స్మరించాడు ... ఆ రాముడి సేవలోనే తరించాడు.


More Bhakti News