భార్య ముచ్చట తీర్చడం భర్త ధర్మం

పెళ్లి అనే పేరుతో ప్రతి ఆడపిల్ల మరొకరి ఇంట అడుగుపెట్టవలసి వుంటుంది. అప్పటివరకూ తల్లిదండ్రుల గారాబాన్ని మాత్రమే ఎరిగిన ఆడపిల్ల, భార్యగా ... కోడలిగా కొత్త బాధ్యతలను నిర్వహించవలసి వుంటుంది. కొత్త ప్రదేశం ... పరిచయంలేని మనుషులు ... వివిధరకాల మనస్తత్వాలు ఆందోళన కలిగిస్తూ వుంటాయి. అయినా సహనంతో సర్దుకుపోవలసి వుంటుంది.

తనవాడు అనే భర్తకోసం, అతని కుటుంబసభ్యులందరికీ ఆమె సేవలు చేయడానికి సిద్ధపడుతుంది. తన ఊరు ... తల్లిదండ్రులు ... స్నేహితులను తలచుకుంటూనే, ఆ జ్ఞాపకాలు అందించే ఉత్సాహంతో అత్తగారిల్లే సర్వంగా భావిస్తూ పనులు చేసుకుంటూ వెళుతుంది. తనకోసం అందరినీ వదులుకుని వచ్చిన భార్యను సంతోషపెట్టడం భర్త ధర్మం. అప్పటివరకూ ఆమె తొలిప్రాధాన్యతను ఇచ్చిన వాటన్నింటికీ, వివాహమయ్యాక భర్త తరువాత స్థానాన్నిఇస్తుంది.

అలాంటి భార్య విశాలహృదయాన్ని భర్త అర్థంచేసుకోవాలి. ఏ కారణంగాను ఆమె కన్నీళ్లు పెట్టకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి పురుషులలో అందరికంటే ముందుగా .. నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది శ్రీరాముడే. వనవాసకాలంలో సీతాదేవి బంగారుజింకను చూసి ముచ్చటపడుతుంది. అది రాక్షసమాయ అని తెలియక ఆ జింక తనకి కావాలని అడుగుతుంది. భార్యను సంతోషపెట్టడం భర్త ధర్మమని ఎరిగిన రాముడు, క్షణమైనా ఆలస్యం చేయకుండా ఆ జింక కోసం వెళతాడు.

ఇక గంధమాదన పర్వతంపై ఉన్నసమయంలో 'సౌగంధికా పుష్పం' కంటబడటంతో, అలాంటి పుష్పాలు తనకి కావాలని భీముడిని అడుగుతుంది ద్రౌపది. ఆ పుష్పాలు గల కొలనుకి యక్షులు రక్షణగా వుంటారు. అయినా ఎన్నో కష్టాలుపడి అక్కడి నుంచి ఆ పుష్పాలను తెచ్చి ద్రౌపది ముచ్చట తీరుస్తాడు భీముడు. ఇలా భర్తగా తమ ధర్మాన్ని ఆచరించిన పురుషులు ఎంతోమంది పురాణాల్లోను ... ఇతిహాసాలలోను కనిపిస్తుంటారు.

అనేక త్యాగాలకు ప్రతిరూపంగా నిలిచిన భార్య కోసం ... ఆమె సంతోషంగా వుండటం కోసం ప్రయత్నించేవాళ్లు ఈ కాలంలోనూ వున్నారు. స్త్రీ సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇంట సంపదలు ... విజయాలు స్థిరంగా ఉంటాయని పెద్దలు చెబుతూ రావడం, పురాణాలలోను ... ఇతిహాసాల్లోనూ భార్యకి ఇవ్వబడిన అనురాగభరితమైన స్థానం ... భారతీయ వివాహవ్యవస్థలో గల గొప్పతనం .. అర్ధాంగిగా స్త్రీ అందిస్తోన్న అసమానమైన సేవలు ఇందుకు కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News