YS Sharmila: నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారు: వైఎస్ షర్మిల

  • సీఎం అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా విషయం మరిచారని ఆరోపణ
  • జగన్ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని విమర్శ
  • తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
Andhrapradesh Congress Chief YS Sharmila Fires On AP CM Jagan At Tiruvuru Sabha

ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్.. ఐదేళ్లయినా ఆ ఊసే ఎత్తడంలేదని, ఇచ్చిన హామీని మరిచిపోయారని ఆరోపించారు. శుక్రవారం తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆమె విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్ గురించి జగన్ ఆలోచించడంలేదన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా.. తెలిసీ ఎలా మరిచిపోయారని ఆమె ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్, ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు. ఐదేళ్లు గడిచినా ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారని షర్మిల ఆరోపించారు.

ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. కనీసం ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ. 3 వేల కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా? సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలను మరచి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించని సీఎం జగన్ కు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.

More Telugu News