గుళ్లోని శివలింగాన్ని మాత్రమే అభిషేకించాలా ?

ఆద్యంతాలు లేని ఆదిదేవుడు ఈ భూమిపై అనేక లింగరూపాలలో ఆవిర్భవించాడు. కొండలపైన ... లోయలలోను ... గుహల్లోను ... సముద్ర తీరాలలోను ... అడవుల్లోను ... ఇలా అనేక ప్రదేశాల్లో శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి. వీటిలో కొన్ని దేవతలు ... మరికొన్ని మహర్షులు ... ఇంకొన్ని మహాభక్తులు ప్రతిష్ఠించినవిగా చెప్పబడుతుంటాయి.

జనసంచారం గల ప్రదేశాల్లో ఉండటం వలన కొన్ని శివలింగాలు నైవేద్యానికి నోచుకుంటూ వుంటే, మరికొన్ని అడవిలో మౌనంగా ధ్యానం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం రోజున ... శివ సంబంధమైన పర్వదినాల్లోను శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. గర్భాలయంలోని శివలింగానికి అభిషేకం చేయడానికి ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు.

కొన్ని ప్రదేశాల్లో గల శివలింగాలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం, ఆలయాల్లో గల శివలింగాలను మాత్రమే ఆరాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆరుబయట ప్రదేశాల్లో వుండే శివలింగాలకు ఎలాంటి శక్తులు ఉండవనీ, ఆలయంలోని శివలింగం మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలదనేది వారి భావనై వుంటుంది. నిజానికి శివలింగం ఎక్కడ వున్నా శివలింగమే ... సాక్షాత్తు అది ఆ పరమేశ్వరుడి స్వరూపమే.

ఆరుబయట ఉన్నంత మాత్రాన శివలింగాన్ని సాధారణమైన శిలగా భావించకూడదు ... మహిమలేనిదిగా చూడకూడదు. పుణ్యక్షేత్రంలో గల శివలింగాన్ని అభిషేకించడం వలన ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, ఎలాంటి పూజలకు నోచుకోకుండా ఓ అడవిలో చెట్టుకింద వున్న శివలింగాన్ని అభిషేకించినా అంతే పుణ్యం వస్తుంది. శివలింగం ఎక్కడ వున్నా దాని చుట్టూ సమస్త పుణ్యతీర్థాలు నెలకొని ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శివలింగాన్ని అర్చించడం వలన సమస్త పుణ్యతీర్థాలను సేవించిన ఫలితం దక్కుతుంది.

ఆలయమనేది అందుబాటులో వుంటుంది కనుక, అక్కడి శివలింగాన్ని అభిషేకించడం అన్నివిధాలా మంచిదే. అయితే ఆరుబయట చెట్టు కిందో ... పుట్టమీదో కనిపించే శివలింగాలను అభిషేకించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనుకోవడం అమాయకత్వం. శివలింగం ఏదైనా దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుంది ... అభిషేకం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది. అందువలన ఎక్కడ శివలింగం కనిపించినా దానిని మనస్పూర్తిగా అభిషేకించవచ్చు ... తనివితీరా పూజించవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News