Rains: తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల వరకు వానలు.. విజయవాడలో ఉన్నట్టుండి కుండపోత

Rain alerts to Andhra Pradesh and Telangana for next 5 days
  • ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న వానలు
  • ఖమ్మం జిల్లా సదాశివునిపాలెంలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వాన 
  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో 79 మిల్లీమీటర్ల వర్షం
  • దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న ఓ మోస్తరు వాన కురిసింది. మెదక్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు కురిశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షం పడగా మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో అత్యల్పంగా 3.7 సెంటీమీటర్ల వాన పడింది. 

విజయవాడలో గంటపాటు కుమ్మేసిన వాన
ఏపీలోని విజయవాడలో నిన్న ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. కృష్ణా, ఏలూరు, గుంటూరు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో జల్లులు పడ్డాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో అత్యధికంగా 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,  అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరో ఐదు రోజులు వర్షాలు
దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో  ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rains
Andhra Pradesh
Telangana
Vijayawada

More Telugu News