కార్తీకంలో దర్శించవలసిన క్షేత్రం

కార్తీకమాసం రాగానే కుటుంబ సభ్యులంతా కలిసి వివిధ శైవ క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు పెట్టుకుని, అక్కడ రద్దీగా వుండటం వలన కాస్త ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని మారుమూల గ్రామాల్లో సైతం మహాశివ క్షేత్రాలు వున్నాయి. సరైన ప్రచారంలేని కారణంగా కొంతమందికి మాత్రమే అవి కొంగుబంగారంగా అలరారుతున్నాయి.

అలాంటి శైవ క్షేత్రాల్లో 'సోమవారం' ఒకటి. వేలసంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం, నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో విలసిల్లుతోంది. ఈ క్షేత్రం ఆవిర్భవించడం వెనుక ఆసక్తికరమైన కథ వుంది. పూర్వం వైకుంఠానికి వెళ్లిన భ్రుగుమహర్షి, తనని విష్ణుమూర్తి పట్టించుకోలేదనే కోపంతో ఆయన వక్షస్థలంపై తన్నాడు.

ఆయన అరికాలులోని కన్నును చిదిమి అహంకారాన్ని పటాపంచలు చేశాడు విష్ణుమూర్తి. దాంతో తాను ఎంతటి మహాపాపం చేశాడో భ్రుగు మహర్షికి అర్థమైపోయింది. పాపపరిహారార్ధం ఏం చేయాలనే విషయమై శివుడిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పంచాక్షరీ జపం చేస్తూ భూలోక సంచారం చేయమనీ, ఎక్కడ ఆయన చేతిలోని జపమాల కిందపడితే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు.

అలా భ్రుగు మహర్షి ఈ ప్రదేశానికి రాగానే, ఆయన చేతిలోని జపమాల కిందపడింది. దాంతో ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయన పాపం నశించబడిందనీ, ఆ క్షేత్రం ఆయన పేరున ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని ఇచ్చాడు. సోముడు వరాన్ని ఇచ్చిన ప్రదేశం కనుక ఈ ఊరుకి 'సోమవరం' అనే పేరు వచ్చింది. ఇక్కడి శివలింగం భ్రుగు మహర్షి ప్రతిష్ఠించినది కనుక 'భ్రుగు సోమేశ్వరస్వామి' పేరుతో పూజించబడుతోంది.

శాలివాహన శకం 1156 లో ఈ క్షేత్రం తిరిగి వెలుగులోకి వచ్చినట్టుగా చెబుతారు. ఇదే ప్రాంగణంలో భవానీదేవి కూడా పూజలు అందుకుంటూ వుంటుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ క్షేత్రం మూసీ నది ఒడ్డున వుండటం వలన, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతున్నందు వలన కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు ... స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News