శ్రీవారి తొలిదర్శనం

శ్రీవారి తొలిదర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం ఒకసారి జరిగితేనే అంతకుమించిన అదృష్టం లేదనిపిస్తుంది. అలాంటిది ఆయన దర్శన భాగ్యం ప్రతిరోజూ లభిస్తే ... అదీ తొలి దర్శనమైతే! ఇక ఆ ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి. అయితే అంతటి సంతోషం సొంతం కావాలంటే కశ్చితంగా పూర్వజన్మ పుణ్యఫలం తోడు రావాలి. అలాంటి పుణ్యఫలం కలియుగంలో యాదవులకి లభించింది. అందువల్లనే ప్రతినిత్యం శ్రీవారి తొలి దర్శన భాగ్యాన్ని వాళ్లు పొందుతున్నారు.

ఇందుకు సంబంధించిన కథ ఒకటి పురాణ కాలం నుంచి ప్రచారంలో వుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు భూలోకానికి వచ్చి , ఒక పుట్టలో ధ్యానంలో ఉండిపోతాడు. స్వామి ఆకలి తీర్చడానికి బ్రహ్మ- విష్ణులు ఆవు ... దూడలుగా చోళరాజు గోశాలకి చేరతారు. ఆ గోవులను గొల్లవాడైన ఓ పశువుల కాపరి మేపుకుని వస్తుండేవాడు. ప్రతినిత్యం గోవులమందతో కలిసి శేషాచలం కొండకి మేతకి వెళ్ళిన సందర్భంలో ఈ ఆవుదూడలు మంద నుంచి వేరై, స్వామి వున్న పుట్ట దగ్గరికి చేరుకునేవి.

ఆవు కురిపించిన పాల ధారలతో స్వామి ఆకలి తీరేది. కొంతకాలం తరువాత ఇది గమనించిన పశువుల కాపరి, ఆవును గొడ్డలితో కొట్టబోగా అడ్డుకోవడం కోసం స్వామి పుట్టలో నుంచి పైకి లేచాడు. ఫలితంగా స్వామి తలకి బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న పశువుల కాపరి తన తప్పును మన్నించమంటూ స్వామి పాదాలపై పడ్డాడు. అంతట శాంతించిన స్వామి భూలోకంలో తనని మొదటిసారి చూసిన యాదవ వంశీయులకే తన తొలి దర్శన భాగ్యం కలిగేలా అనుగ్రహించాడు. నాటి నుంచి నేటి వరకూ ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.

ఉదయాన్నే స్వామిని తొలిసారిగా దర్శించుకునే గొల్లని ... సన్నిధి గొల్ల అంటారు. ప్రతి నిత్యం బ్రాహ్మి ముహూర్తంలో సన్నిధి గొల్ల శుచియై ... నామాలు ధరించి, అర్చకులను ... జీయంగార్ ను ఆలయానికి ఆహ్వానిస్తాడు. వారి సమక్షంలో గర్భగుడి తలుపులు తెరిచి, దీపపు వెలుగులో స్వామివారిని దర్శించుకుంటాడు. ఆ తరువాత యధావిధిగా స్వామివారికి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

More Bhakti Articles