ప్రాణాలు కాపాడిన అక్కమహాదేవి

ప్రాణాలు కాపాడిన అక్కమహాదేవి
అక్కమహాదేవి శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం చేసుకోవాలని అనుకుంది. క్రూరమృగాలు సంచరించే అడవీ మార్గంలో ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పగలు ... రాత్రి అనే తేడా లేకుండా ఆమె ముందుకి సాగుతూనే వుంది. మార్గమధ్యంలో ఆమెకి ఒకచోట వీరభద్ర స్వామి విగ్రహం కనిపించింది. అది రాత్రి సమయం కావడంతో, అక్కడ నెగడు వేసి ఆమె ఆ స్వామిని పూజించసాగింది.

అయితే ఈ నెగడు చూసి అక్కడికి సమీపంలోని కోయలు పరిగెత్తుకుంటూ వచ్చారు. నిత్యం తాము పూజించే వీరభద్రస్వామి విగ్రహం ఎదురుగా కూర్చుని పూజ చేస్తోన్న అక్కమహాదేవిని ... ఆ పక్కనే ఆమె వేసిన నెగడుని చూశారు. దేహంపై శిరోజాలను నిండుగా కప్పుకున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె వాళ్లని చూసేంత వరకూ వాళ్లు ఆమెని అలాగే చూస్తుండి పోయారు.

పూజ పూర్తి కాగానే యథాలాపంగా పక్కకి తిరిగిన అక్కమహాదేవి,కోయలను చూసింది. అక్కమహాదేవి చూపులోని ప్రశాంతత ... ఆమె చిరు మందహాసం చూడగానే, ఆమె మామూలు మనిషికాదనీ, ఆమె వలన తమకి ఎలాంటి హాని కలగదని కోయలు గ్రహించారు. ఆమెని తమ గూడానికి తీసుకువెళదామని వాళ్లు అనుకునే లోగా, వారిలో ఒకడిని పాము కరిచింది. అది విషనాగు కావడంతో వాడు అక్కడికక్కడేపడి విలవిలాకొట్టుకోసాగాడు.

ఆ పాము విషానికి విరుగుడు లేదనీ ... తమ వాడిని ఎలాగైనా కాపాడమని వాళ్లు అక్కమహాదేవిని కోరారు. దాంతో అక్కమహాదేవి పాముకాటుకి గురైన వ్యక్తి చెంత కూర్చుంది. తన కమండలంలోని నీరు పాముకరిచిన చోటున చల్లింది. ఆ తరువాత ఆమె ధ్యానంలోకి వెళ్లింది. కొంతసేపటికి పాముకాటుకి గురైన వ్యక్తి బాధ నుంచి ఉపశమనం పొందుతూ సాధారణ స్థితికి చేరుకున్నాడు. అంతే గూడెం ప్రజలంతా అక్కమహాదేవిని తమ దైవంగా భావించారు. కృతజ్ఞతా పూర్వకంగా ఆమె పాదాలకి నమస్కరించారు.

More Bhakti Articles