మహిమగల హనుమంతుడు

మహిమగల హనుమంతుడు
శ్రీరాముడి సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన హనుమంతుడు, రాక్షస సంహారంలో కీలకమైన పాత్రను పోషించాడు. దుష్ట శక్తుల బారి నుంచి తన భక్తులను కాపాడుకోవడంలో ఆయన ముందే వుంటాడు. అలాంటి హనుమంతుడు స్వయంభువుగా ఆవిర్భవిస్తే ... రాఘవేంద్రస్వామిచే పూజలు అందుకుంటే .. ఇక ఆ క్షేత్ర మహాత్మ్యం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది ? అలాంటి మహిమాన్వితమైన క్షేత్రంగా కర్ణాటక రాష్ట్రంలోని 'పంచముఖి' దర్శనమిస్తుంది.

ఇక్కడి హనుమంతుడు పంచముఖాలతో కొలువైవున్న కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి కొండ గుహలో హనుమంతుడు ఒక రాతి బండపై వెలిశాడు. ఇదే గుహలో రాతి గోడకి శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా వెలిశాడు. ఈ గుహలో శ్రీ రాఘవేంద్రస్వామి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకున్నట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా మనకి కనిపిస్తాయి. నాడు రాఘవేంద్ర స్వామి కూర్చున్న ప్రదేశంలో నేడు 'బృందావనం' (తులసి కోట) దర్శనమిస్తూ వుంటుంది.

స్వప్నంలో స్వామి కనిపించి చెప్పిన ప్రకారం ఓ భక్తుడు ఆయన జాడ తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి నిత్య పూజాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. ఇక ఈ కొండపై ఒక పెద్దరాయి పొడవుగా 'విమానం' ఆకారంలో కనిపిస్తూ వుంటుంది. మరో రాయిని ఆధారం చేసుకుని ఇది నిలిచివుంటుంది. దీనిని చూస్తుంటే గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. స్వామి ఈ వాహనంపై ఆకాశ మార్గాన విహరిస్తుంటాడని చెబుతుంటారు.

ఇక ఇక్కడి స్వామివారి పాదాలకు ప్రత్యేక మందిరం ఏర్పాటు చేయబడింది. కలలో స్వామి కనిపించి ఆదేశించిన కారణంగా ఒక భక్తుడు స్వామివారి కోసం ప్రత్యేకంగా పాదరక్షలు తయారు చేసి ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ వంశానికి చెందిన వారు ప్రతి అయిదు సంవత్సరాలకి ఒకసారి కొత్త పాదరక్షలు సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ పాదరక్షలు ధరించి రాత్రి వేళల్లో స్వామి విహరిస్తూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు.

ఈ పాదరక్షలను దర్శించినవారు భూత .. ప్రేత .. పిశాచ బాధల నుంచి బయటపడతారని అంటారు. హనుమజ్జయంతితో పాటు మిగతా పర్వదినాల్లో సైతం స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఆయన అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతూ వుంటారు.

More Bhakti Articles