మహిమ చూపిన బ్రహ్మం గారు

మహిమ చూపిన బ్రహ్మం గారు
ఒకసారి కడప నవాబు ఆహ్వానం మేరకు తన శిష్యులతో కలిసి ఆయన ఆస్థానానికి చేరుకున్నాడు బ్రహ్మం గారు. ఆయనని నవాబు సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. బ్రహ్మం గారు వచ్చారని తెలిసి ఆ గ్రామస్తులంతా నవాబు ఆస్థానానికి చేరుకున్నారు. అయితే గతంలో సిద్ధయ్య గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన నవాబు, ఆయన గురువైన బ్రహ్మం గారి మహిమను కూడా ప్రత్యక్షంగా చూడాలని నిర్ణయించుకున్నాడు.

రహస్యంగా ఒక పెద్ద పళ్లెంలో జంతు మాంసం తెప్పించి దానిపై వస్త్రం కప్పించాడు. ఆస్థానంలో అంతా వున్న సమయంలో ఆ పళ్ళెం తెప్పించాడు. అందులోని ప్రసాదాన్ని అందరికీ పంచమని బ్రహ్మంగారిని కోరాడు. నవాబు గురించి తెలిసిన కొందరు ఆందోళన చెందుతూ వుండగా, మిగతావారు ప్రసాదం స్వీకరించడానికి సిద్ధమై పోయారు.

బ్రహ్మం గారు తన కమండలం తీసుకుని అందులోని నీటిని ఆ పళ్లెంపై గల వస్త్రం పై చల్లాడు. ఆ తరువాత అందులోని ప్రసాదాన్ని అందరికీ పంచమని సిద్ధయ్యతో చెప్పాడు. పళ్లెంపై గల వస్త్రాన్ని తొలగించి అందులోని రకరకాల రుచికరమైన ఫలాలను సిద్దయ్య అందరికీ పంచుతుండటం చూసి నవాబు ఆశ్చర్యపోయాడు. జంతుమాంసం ఫలాలుగా మారిపోవడంతో ఆయన తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

తాను చేసిన పని గురించి బ్రహ్మం గారికి చెప్పాడు. ఆయన శక్తులను పరీక్షించడానికి ప్రయత్నించినందుకు మన్నించమని కోరాడు. ఎంత కాలం నుంచో తనని పరీక్షించాలనే ఆయన కోరికను నెరవేర్చడం కోసమే తాను వచ్చానని చెప్పాడు బ్రహ్మం గారు. మహనీయుడైన ఆయన తన ఆస్థానానికి రావడమే తాను చేసుకున్న అదృష్టమంటూ ఆయనకు నవాబు వినయంగా నమస్కరించాడు.

More Bhakti Articles