అయ్యప్ప స్వామి క్షేత్రం

అయ్యప్ప స్వామి క్షేత్రం
కార్తీకమాసం ప్రారంభమవుతుందనగానే అయ్యప్పస్వామి దీక్షలు ఆరంభమవుతుంటాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని అయ్యప్పస్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి. అలా భక్తులచే నిత్య పూజలందుకుంటొన్న అయ్యప్పస్వామి ఆలయం ఖమ్మం జిల్లా భద్రాచలంలో దర్శనమిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతోన్న ఈ ఆలయ నిర్మాణం, ప్రాచీన ఆలయాల నిర్మాణ శైలిని పోలివుంటుంది.

చాలాకాలం క్రిందటే ఈ ప్రాంతంలో అయ్యప్పస్వామి దీక్షను తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాంతో అంతా కలిసి ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. విశాలమైన ప్రదేశంలో ఆలయాల సమాహారంగా అలరారుతోన్న ఈ క్షేత్రం, అడుగడుగునా భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. విశాలమైన మంటపం ... అద్భుతంగా తీర్చిదిద్దిన 18 మెట్లు ... వేదికపై 'చిన్ముద్ర' లో అయ్యప్పస్వామి దర్శనమిస్తుంటాడు.

స్వామి రూపం సుందరంగా ... సుమనోహరంగా కనిపిస్తూ మంత్రముగ్ధులను చేస్తుంటుంది. కోరిన వరాలను ప్రసాదించడంలో ఇక్కడి స్వామి ఎంత మాత్రం ఆలస్యం చేయడని భక్తులు చెబుతుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం కూడా దర్శనమిస్తుంది. నిలువెత్తు రూపంతో ... చక్కని కనుముక్కుతీరుతో దృష్టి మరల్చుకోవడానికి సాధ్యంకాని సౌందర్యంతో స్వామి కొలువై ఉంటాడు.

ఇక గణపతి .... కుమార స్వామి ... నాగేంద్రుడు కూడా ప్రత్యేక మందిరాల్లో పూజలు అందుకుంటూ వుంటారు. ప్రధాన ఆలయాల్లో అటు అయ్యప్పస్వామి ... ఇటు వేంకటేశ్వరస్వామి నెలకొని వున్న కారణంగా ఈ క్షేత్రం 'హరిహర క్షేత్రం'గా విరాజిల్లుతోంది.

More Bhakti Articles