దొంగలను భయపెట్టిన దేవుడు

దొంగలను భయపెట్టిన దేవుడు

దొంగలను భయపెట్టిన దేవుడు
తుకారాం నివసిస్తోన్న గ్రామంలో పాండురంగస్వామి ఆలయం వుండేది. ప్రతి నిత్యం ఆ స్వామి దర్శనం చేసుకోకుండా, తుకారాం ఉండేవాడు కాదు. ఆ స్వామికి ఎదురుగా నిలబడి ఆయన మాట్లాడేవాడు ... పాటలు పాడేవాడు. ఆ ఊళ్లో దేవుడు తరువాత దేవుడిగా ఆయనను అంతా పూజించేవారు. అయితే ముంభాజీ అనే దొంగ భక్తుడుకి ఇదంతా కంటగింపుగా వుండేది.

తుకారాంని ఎదుర్కోవడానికి ఆయన తనకంటూ కొంతమంది అనుచరులను తయారు చేసుకుని, ఓ రాత్రివేళ ఆలయంలోని పాండురంగస్వామి విగ్రహాన్ని కాజేశాడు. తన అనుచరుల సహాయంతో దానిని ఊరు చివరన గల పాడుబడిన బావిలో పడేశాడు. మరునాడు ఉదయం గర్భాలయంలో స్వామి కనిపించకపోవడంతో, తుకారాం తల్లడిల్లిపోయాడు. గ్రామస్తులంతా ఆందోళన చెందసాగారు.

జరిగిన సంఘటనకి తుకారాం కారకుడని, శివాజీ మహారాజుకి ఫిర్యాదు చేశాడు ముంభాజీ. అంతకుముందే తుకారాం గొప్పతనం గురించి విన్న శివాజీ, జరిగినదేవిటో తెలుసుకోవడం కోసం తానే స్వయంగా ఆ గ్రామంలోని ఆలయానికి వచ్చాడు. తనకి వచ్చిన ఫిర్యాదు గురించి తుకారాంతో చెప్పి, ఆయన మీద పడిన నింద నిజం కాదని నిరూపించుకోమని అన్నాడు.

దాంతో తన నిజాయితీని నిరూపించవలసినదిగా ఆ పాండురంగడిని ప్రార్ధించాడు తుకారాం. అంతా చూస్తుండగానే గర్భాలయంలోని వేదికపై స్వామివారి మూలమూర్తి ఎప్పటిలానే నిలిచి దర్శనమిచ్చింది. ఆ విచిత్రాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఊహించని ఆ సంఘటనకు భయపడిపోయిన ముంభాజీ ... ఆయన అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. తుకారాం నిజభక్తిని ప్రత్యక్షంగా చూసిన శివాజీ మహారాజు, ఇక నుంచి తాను ఆయన శిష్యుడినంటూ వినయంగా నమస్కరించాడు.

More Bhakti Articles