తిరువూరు

తిరువూరు
ఆపదమొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడ కొలువై వుంటే అక్కడ కష్టాలు కనుమరుగై పోతాయనీ, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ స్వామి కొలువైన సాధారణ ఆలయాలు సైతం నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటిది ఆయన స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు ఎంతటి జనాదరణ కలిగివుంటాయనేది అర్థం చేసుకోవచ్చు. అలా శ్రీదేవి - భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన క్షేత్రం కృష్ణా జిల్లా 'తిరువూరు'లో దర్శనమిస్తోంది.

వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక రైతు కలలో స్వామి కనిపించి, తాను ఫలానా ప్రదేశంలో ఉన్నట్టుగా చెప్పాడట. మరునాడు ఉదయం ఆ రైతు స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రదేశానికి చేరుకొని స్వామి జాడ తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని తిరువూరు రాజావారికి తెలియజేయగా, ఆయన స్వామివారికి ఆలయాన్ని నిర్మించి, శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠింపజేశారు.

ఆనాటి నుంచి కొంతకాలం క్రితం వరకూ ఈ రాజవంశీకులే ఆలయ నిర్వహణ బాధ్యతను వహిస్తూ వచ్చారు. ఈ కారణంగానే ఉత్సవాల సమయంలో స్వామి రాజావారి దివాణానికి వెళ్లి తొలిపూజను అందుకుంటూ ఉంటాడు. విశాలమైన ఆవరణ ... అందమైన ముఖద్వారం దాటి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే, స్వామికి సంబంధించిన యాగశాల ... వంటశాల ... కళ్యాణ మంటపం ... కనిపిస్తాయి. మరో వైపున శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుగా విశాలమైన మంటపం దర్శనమిస్తుంది.

గర్భాలయంలో ఉభయదేవేరీలతో స్వామి కళకళలాడుతూ కనిపిస్తాడు. గర్భాలయానికి ఒకవైపున గోదాదేవి ... మరోవైపున ఆళ్వారులు ప్రత్యేక మందిరాలలో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. ధనుర్మాసంలో గోదాకల్యాణం ... మాఘపౌర్ణమి రోజున స్వామివారి కల్యాణం జరుగుతుంది. అయిదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు.

More Bhakti Articles